సంగారెడ్డి : తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా చేసిన.. రూ. 2 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన ఓ యువకుడిని మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఏఈఓగా పనిచేస్తున్న సంతోష్ వివాహం ఆదివారం శిరీష అనే అమ్మాయితో జరిగింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అతి కొది మంది అతిథుల మధ్య వీరు పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి ఖర్చు ఆదా అయింది. అయితే తన పెళ్లికి కొన్ని రోజుల ముందటే ఆ మొత్తాన్ని సంతోష్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్కడి వచ్చారు. సంతోష్ తన పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకున్న రూ. 2 లక్షలను కరోనా నివారణ చర‍్యలకు విరాళంగా ఇచ్చినందుకు అభినందించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్ నిర్ణయం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వివాహ వేడుక సందర్భంగా అక్కడికి వచ్చినవారిలో చాలా మంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.